షర్మిలకు నేతల షాక్

వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ నేతలు కొందరు పెద్ద షాకిచ్చారు. గట్టు రామచంద్రరావు నాయకత్వంలో కొందరు నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. తర్వాత పార్టీ ఆపీసు బయటే నిలబడి షర్మిల గో బ్యాక్ అంటు నినాదాలు చేయటం కలకలం సృష్టించింది. ఇప్పటివరకు పార్టీలో ఉండలేని నేతలు రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయారంతే. అంతేకానీ షర్మిలను ఉద్దేశించి తెలంగాణా నుండి గో బ్యాక్ అంటు నినాదాలు చేసింది లేదు.

షర్మిల రాజకీయం కూడా ఒకదారి తెన్ను లేకుండా గాలికి వెళుతోంది. దాంతో ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలంతా తలలు బాదుకుని రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ తో పొత్తన్నారు. మరోసారి లేదు లేదు విలీనమే అన్నారు. చివరకు పొత్తూ లేదు విలీనమూ లేదని తేల్చారు. ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ పోటీచేస్తుందని ప్రకటించారు. ప్రకటించిన మూడురోజులకు ఎన్నికల్లో పోటీ నుండి పార్టీ తప్పుకుంటుందోన్నారు. కారణం ఏమిటంటే కేసీయార్ వ్యతిరేక ఓట్లు చీలకుండానే అని సమర్ధించుకున్నారు.

ఇదే నిజమైతే మరి పార్టీ పెట్టి రెండేళ్ళు ఎందుకు జనాల్లో తిరిగారు. ఎన్నికల్లో ప్రతిపక్షాల పోటీ వల్ల అధికారపార్టీకి లాభం జరుగుతుందని షర్మిలకు అంతమాత్రం తెలీదా ? కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీ అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేస్తుందని ఎలా ప్రకటించారు ? అప్పుడు ఓట్లు చీలిపోయి కేసీయార్ మళ్ళీ అధికారంలోకి వస్తారని తెలీదా ? పొత్తు పేరుతో, విలీనం పేరుతో తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీకే ఓట్లేయమని షర్మిల ఇపుడు ఎలా చెబుతున్నారు ?

అందుకనే షర్మిల రాజకీయం చాలా విచిత్రమైన పద్దతిలో సాగుతోంది. ఇలాంటి అనేక కారణాలతోనే షర్మిలను తెలంగాణా జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఒకవేళ షర్మిల పార్టీ ఎన్నికల్లో పోటీచేసినా డిపాజిట్లు తెచ్చుకునేది కూడా అనుమానమే. ఒక విధంగా పోటీకి దూరమని ప్రకటించి షర్మిల పరువు కాపాడుకున్నారనే చెప్పాలి. జనాలను నమ్మించేందుకు షర్మిల ఎన్ని మాటలు చెప్పినా, ప్రకటనలు చేసినా ఎవరు నమ్మరు. ఈ నేపధ్యంలోనే రాజీనామాలు చేసిన నేతలు షర్మిలను ఉద్దేశించి గో బ్యాక్ అని నినాదాలు చేసింది.