టీడీపీ అధినేత చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించిన వైద్యులు ఆయనకు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేశారు. చంద్రబాబు ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. నిన్న ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చర్మ సంబంధిత చికిత్స తీసుకున్న చంద్రబాబు నేడు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ నెల 22వరకు అరెస్టు చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, ఈ నెల 28 వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు ఏజీ తెలిపారు.
మరోవైపు, చంద్రబాబుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరో నిందితుడైన సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ కు సుప్రీం కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పూర్తి స్థాయి బెయిల్ గా మారుస్తూ తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సత్యభాస్కర్ ఏ 35గా ఉన్నారు. అయితే, ఈ కేసులో ఏ 38 అయిన చంద్రబాబుకు మాత్రం ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ రాలేదు.