తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు పోటీకి రెడీ అయిన.. జనసేనలో టికెట్ల కేటాయింపు కూడా ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు అసలు పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంస నుంచి బయట పడి.. బీజేపీతో చేతులు కలిపి.. 9 స్థానాలను దక్కించుకుని.. వాటిలో పోటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కీలకమైన కూకట్‌పల్లి స్థానం నుంచి అభ్యర్థిని ఖరారు చేశారు. హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను పవన్ ప్రకటించారు.
ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు.. సామాజిక వర్గం పరంగా కూడా ప్రేమ్‌కుమార్ కు కూకట్ పల్లి వంటి కీలక టికెట్ ఇవ్వడంతో జనసేనలో జోష్ పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పలువురు తెలంగాణకు చెందిన నాయకులను కూడా పార్టీలో చేర్చుకున్నారు. సినీ నటుడు సాగర్, భద్రాద్రి కొత్తగూడెనికి చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగానే కూకట్ పల్లి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని ప్రకటించారు.
త్వరలోనే మిగిలిన అభ్యర్తులను కూడా ప్రకటించనున్న పవన్ చెప్పారు. మొత్తం 9 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో పార్టీ విషయంలో అంకిత భావం చూపే వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనేచర్చసాగుతోంది. అయితే.. ఇలా పార్టీలో చేరిన వ్యక్తికి అలా టికెట్ ప్రకటించడంపై జనసేనలోనూ చర్చసాగుతోంది. అయితే, ప్రేమ్‌కుమార్‌కు పవన్‌కు మధ్య స్నేహం ఉందని.. ఎప్పటి నుంచో ఇద్దరి మధ్న పరిచయం కూడా ఉందని అందుకే టికెట్ ఇచ్చి ఉంటారని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. కూకట్‌పల్లిలో బీఆర్ ఎస్ అభ్యర్థికి దీటుగా ప్రేమ్‌కుమార్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.