తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిస్తుండగా…తెలంగాణలో ఢిల్లీ పాలన వద్దని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు పందులు గుంపులుగా వస్తున్నాయని, కానీ, సింహం సింగిల్ గా వస్తుందని కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ విపక్ష నేతలపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను ఓడించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని, కేసీఆర్ మాత్రం సింహంలా సింగిల్‌గా వస్తారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోరాటం జరుగుతోందని, ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం అని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మన నెత్తిన పాలు పోశారని, కర్ణాటకలో 5 గంటల విద్యుత్ అని ఆయన అన్నారని, తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.
ఆయన ఆ మాట అన్నారనే టీ కాంగ్రెస్ నేతలు ఆయనను మళ్లీ ప్రచారానికి పిలవడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3వ తేదీన చూద్దామని, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదని రాహుల్, మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఢిల్లీలోనే తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ భరోసా కేసీఆర్ అని, సెంటిమెంట్లకు, అపాయింటుమెంట్లకు లొంగవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఆమెను దేవత అంటున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో వేములవాడలో బీఆర్ఎస్ ఓడిపోతే అక్కడకు రానని కేటీఆర్ అన్నారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ పలువురు పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి చిందేశారు. దేఖ్ లేంగే పాటకు స్టేజ్ పలువురితో కలిసి కేటీఆర్ స్టెప్పులేశారు. గులాబీ జెండాలే రామక్కా పాటకు చిందేసిన కేటీఆర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.