పన్నుల వసూళ్లు.. ఇది ఏ దేశానికైనా.. రాష్ట్రానికైనా కీలక అంశం. పన్నుల రాబడిని బట్టి ఆయా దేశాలు, రాష్ట్రాల అభివృద్ధి పురోగతని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తారు. ఇక, దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పైసా కూడా ఖచ్చితంగా లెక్కించే పరిస్థితి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయా జీఎస్టీ ఆదాయాల ఆధారంగా రాష్ట్రాల పురోగతిని, ప్రజల వ్యాపార లావాదేవీలు.. వస్తు సేవల వినిమయం, రాబడి వంటి వాటిని నిక్కచ్చిగా లెక్కిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్ల వృద్ధికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఏ రాష్ట్రం ఇప్పటి వరకు ఎంత మేరకు పన్నులు వసూలు చేసిందనే వివరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనినే ఆయా రాష్ట్రాల వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో స్పష్టంగా చెప్పేందుకు గీటురాయిగా వాడుతున్నారు.
తాజాగా కేంద్రం ప్రకటించిన ఈ GST వసూళ్లకు సంబంధించిన డేటాలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంది. అంతేకాదు.. కర్ణాటక వంటి ఐటీ ఇండస్ట్రీ ఉన్న రాష్ట్రాలతోనూ పోటీ పడుతుండడం గమనార్హం. ఈ పరిణామం.. ఇప్పటి వరకు విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వానికి కొంత ఊరట కల్పించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
తాజా GST వసూళ్ల వృద్ధి ఇదీ..
+ అక్టోబర్ 2023 వరకు GST వసూళ్ల వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి.
+ ఏపీ GST ఆదాయం 12% వృద్ధి రేటుతో రూ.18,488 కోట్లు.
+ కర్ణాటక కూడా 12% వృద్ధి రేటుతో ముందుంది. అయితే.. ఈ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే.
+ హైదరాబాద్ వంటి కీలక రాజధాని.. సైబరాబాద్ వంటి ఐటీ నగరం ఉన్న తెలంగాణ 10% GST మాత్రమే వసూలు చేసింది.
+ ఇక, చెన్నై వంటి అద్భుత నగరం ఉన్న తమిళనాడు 9%, విద్యలకు ఆలవాలమైన కేరళ 5% వృద్ధి రేటును నమోదు చేశాయి.
దేశవ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
+ దేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,72,003 కోట్లు
+ దీనిలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ,
+ రూ.91,315 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి) ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ.1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయి.