ఏపీ అధికారపక్షానికి.. ఆంధ్రజ్యోతి మీడియాకు మధ్య నడుస్తున్న పోరు గురించి ఆ రాష్ట్రంలోని పిల్లాడ్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇంతకాలం తమ వార్తలతో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సదరు మీడియా సంస్థ తరఫున ఒకరు.. తాజాగా న్యాయపోరాటానికి దిగటం ఆసక్తికరంగా మారింది. ఏపీ సర్కారు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు విజయవాడకుచెందిన కిలారు నాగశ్రవణ్.
ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగంగా సాక్షి దినపత్రిక.. ఇందిరా టెలివిజన్ కు చెందిన సాక్షి టీవీకి మాత్రమే ఇస్తున్న వైనాన్ని కోర్టు మందుకు తీసుకొచ్చింది. తన వాదనకు బలం చేకూరేలా కొన్ని ఆధారాల్ని కోర్టు ముందు ఉంచారు పిటిషనర్. ప్రభుత్వ నిర్ణయంతో అర్హత ఉండి కూడా కొన్ని మీడియా సంస్థలకు ప్రకటనలు రావటం లేదని.. సీఎం బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటోను నిర్ణీత పరిమాణం కంటే పెద్దగా ప్రచురిస్తున్నారని.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండా రంగుల్ని ప్రభుత్వ ప్రకటనల్లో వినిగించటం రాజకీయంగా ప్రభావితం చేసినట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ పక్షపాత వైఖరి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పేర్కొన్నారు.
సర్క్యులేషన్ పరంగా చూస్తే.. ఆంధ్రజ్యోతి మూడో స్థానంలో ఉందని.. రెండో స్థానంలో సాక్షి ఉందని చెప్పారు. అలాంటి వేళ.. 2019 మే 23 నుంచి 2020 మే 30 వరకు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలు.. వాటి ఖర్చు వివరాల్ని తాను పొందానని.. అందులో సాక్షి పత్రికకు భారీగా ప్రకటనలు ఇస్తున్నారని.. సర్య్కులేషన్ తో సంబంధం లేకుండా కొన్ని వార్తా పత్రికలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి తరపున.. ఆ సంస్థకు రావాల్సిన ఆదాయం గురించి హైకోర్టులో పిటిషన్ వేసి మరీ వాదిస్తున్న ఈ నాగ శ్రవణ్ ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరు జరుపుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates