జానారెడ్డి కమిటి ఫెయిలైందా ?

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ టికెట్ల ప్రకటన తర్వాత కచ్చితంగా కొందరు నేతల్లో అసంతృప్తులు బయటపడతాయని అధిష్టానం ముందుగానే గుర్తించింది. అందుకనే అసంతృప్తులను బుజ్జగించి వాళ్ళని పార్టీలోనే కంటిన్యు అయ్యేట్లుగా ఒప్పించి, అభ్యర్ధుల గెలుపుకు సహకరించేట్లుగా ఒప్పించేందుకు ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీమంత్రి జానారెడ్డి ఉన్నారు. సభ్యులుగా మాణిక్ రావ్ థాక్రే, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.

పార్టీ టికెట్లు ప్రకటిస్తోంది, అసంతృప్తులు రెచ్చిపోతున్నారు, కాంగ్రెస్ కు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అసంతృప్తనేతలు గాంధీభవన్ కు వచ్చి నానా గోలచేస్తున్నారు. పార్టీలో ఇంతజరుగుతున్నా జానారెడ్డి కమిటి ఏమిచేస్తున్నట్లు ? ఏమీ చేయటంలేదు జరుగుతున్న గొడవలను జస్ట్ చూస్తు కూర్చున్నదంతా. ఎందుకంటే టికెట్ వచ్చిన తన కొడుకును గెలిపించుకునే విషయంలో జానారెడ్డి బిజీగా ఉన్నారు. ఇక థాక్రే ఏమో టికెట్ల ఖరారు మీటింగుల్లో ఢిల్లీలో తీరికలేకుండా ఉన్నారు.

మిగిలిన ఇద్దరు సభ్యులు మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీకి రాష్ట్ర రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదు. కాబట్టి వీళ్ళకి పార్టీ నేతలు తెలీదు, పార్టీ నేతలకు వీళ్ళెవరో తెలీదు. అందుకనే వీళ్ళిద్దరు కూడా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవటంలేదు. దీని ఫలితం ఏమైందంటే టికెట్లు దక్కని అసంతృప్త నేతలను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దాంతో అసంతృప్త నేతలంతా మండిపోతు గొడవలు చేస్తున్నారు లేకపోతే రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోతున్నారు.

మామూలుగా ఏ పార్టీలో అయినా జరిగే తంతు ఇదే. కాకపోతే టికెట్లు దక్కని నేతలను పార్టీలోని సీనియర్లు దగ్గర కూర్చుని ఏదో ఒక హామీతో బుజ్జగించటం చాలా సహజం. అవసరమైతే పార్టీ అగ్రనేతలతో ఫోన్లో మాట్లాడించి ఏదో ఒక హామీ ఇప్పిస్తారు. దాంతో చాలామంది అసంతృప్త నేతలు తమ అలక వీడి మళ్ళీ పార్టీలో కంటిన్యు అవుతారు. అయితే ఈ ప్రాసెస్ చాలా స్పీడుగా జరగాలి. ఎందుకంటే అసంతృప్తనేతలు పదుల సంఖ్యలో ఉంటారు కాబట్టి బుజ్జగింపుల కమిటిలో సభ్యులు చాలా స్పీడుగా ఉండాలి. కానీ కాంగ్రెస్ లో కమిటి ఉంది కానీ పనిచేయటంలేదు. అందుకనే జానారెడ్డి కమిటి ఫెయిలైందని అనుకుంటున్నారు.