ఏపీలో వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ-జనసేనలు రెడీ అయ్యాయి. ఇప్పటికే పొత్తులకు సంబంధించిన ప్రక్రియను ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల నేపథ్యంలో కూడా సమన్వయం సాధించాల్సిన అవసరం ఉందని పార్టీ అగ్రనాయకులు గుర్తించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన పార్టీల మధ్య సఖ్యత అంతగా లేదనేది వాస్తవం.
పైగా టికెట్ల పోరు కూడా ఈ రెండు పార్టీల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు తమకంటే తమకే దక్కాలనే భావన ఉంది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్‌ను ఇద్ద రు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన తరఫున పోతిన మహేష్ ఇక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో వీరి మధ్య ఎక్కడా సఖ్యత లేదు.
ఇక, నంద్యాల నియోజకవర్గం సహా.. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. కొన్ని చోట్ల జనసేన నాయకులు ఒకింత బలంగా ఉండగా.. అలాంటి చోట టీడీపీ సహకారం అత్యంత కీలకంగా ఉంది. ఇక, మరికొన్ని నియోజకవర్గాల్లో ఉభయ పార్టీలు కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇలా.. మొత్తంగా పార్టీల పరంగా క్షేత్రస్థాయిలో నాయకులను ముందుకు కదలించడం ఇప్పుడు ప్రధాన పరిణామం.
ప్రస్తుతం టీడీపీ-జనసేన పార్టీలు.. సమన్వయ కమిటీల సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలను సమన్వయ పరచడం ద్వారా.. క్షేత్రస్థాయిలో నాయకులను కలిసి ముందుకు నడిచేలా దిశానిర్దేశం చేయాలనేది పార్టీల ప్రధాన వ్యూహం. ఇదిలావుంటే.. పార్టీల్లో యువత ఎక్కువగా ఉండడం.. వచ్చే ఎన్నికల్లో పరిణామాలు ఆసక్తిగా మారనున్న నేపథ్యంలో సమన్వయ కమిటీల ద్వారా పార్టీలను ఏకతాటిపైకి నడిపించడం సాధ్యమైతేనే పొత్తు ఫలించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.