“దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గత రాత్రి నా కలలో కనిపించాడు. వచ్చీ రాగానే.. జగన్‌కు కొంచెం బుద్ధి నేర్పు బాబూ! అని కోరారు”- అని టీడీపీ సీనియర్ నాయకుడు, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. చంద్రబాబును అరెస్టుచేసి జైల్లో పెట్టడం పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ చాలా క్షోభిస్తున్నట్టు తనకు అనిపించిందన్నారు. ఈ మేరకు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో “బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాగంటి మాట్లాడుతూ.. “నాకు రాత్రి నిద్రిస్తుండగా కలలో స్వర్గీయ రాజశేఖరరెడ్డి ప్రత్యక్షమయ్యాడు. రాష్ట్రంలో జరుగుతున్న ఆయన కుమారుడు వైఎస్ జగన్ పాలనపై తీవ్రంగా కలత చెందారు. కొడుకు జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తనపై తీవ్రంగా బాధ పడ్డాడు. తండ్రి వయస్సులో ఉన్న చంద్రబాబుపై తన కొడుకు ప్రవర్తిస్తున్న తీరు తప్పు అన్నారు. ఈ విషయాన్ని చెప్పి సీఎం జగన్‌కు ఒకింత బుద్ధి నేర్పాలని, మంచి చెడులు సూచించాలని నన్ను కోరారు” అని మాగంటి బాబు వ్యాఖ్యానించారు
ఇదిలావుంటే, చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి చేస్తున్న నిజంగెలవాలి యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాంగటి పిలుపునిచ్చారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనూ ఏనాడూ ఇంటి గుమ్మం దాటకుండా సేవా కార్యక్రమాలకే పరిమితమైన నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వచ్చారని చెప్పారు.
ఈ నేపథ్యంలో భువనేశ్వరికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక, వయస్సు రీత్యా, అనారోగ్య సమస్యల రీత్యా చంద్రబాబు నాయుడును జైలు నుంచి తక్షణమే విడుదల చేసి.. ఆయనకు మారుగా తనను జైల్లో పెట్టాలని మాగంటి బాబు వైసీపీ సర్కారును కోరడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates