రాబోయే ఎన్నికల్లో ఏదేదో ఊహించుకుని కేసీయార్ అభ్యర్థులను దాదాపు రెండు నెలలకు ముందే ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ప్రకటన కారణంగా బీఆర్ఎస్ అభ్యర్ధులకు మంచి మైలేజీ దక్కాల్సిందే. అయితే అందుకు విరుద్ధంగా జనాల్లో వ్యతిరేకత కనబడుతోంది. అందుకు కారణం ఏమిటి ? అంటే ఎక్కువమందికి సిట్టింగ్ ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించటం. కేసీయార్ వ్యవహార శైలి ఎలాగుందంటే 2018-23 మధ్య నియోజకవర్గాలను ఎంఎల్ఏలకు రాసిచ్చేశారు.
తమ నియోజకవర్గాలకు ఎంఎల్ఏలే రాజుల్లాగ తయారయ్యారు. దాంతో ఏమైందంటే చాలా నియోజవర్గాల్లో ఆకాశమే హద్దుగా అవినీతి, అరాచకాలు, భూకబ్జాలు పెరిగిపోయాయి. దాంతో సహజంగానే జనాల్లో కొందరు మంత్రులు, చాలామంది ఎంఎల్ఏలంటే విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. సిట్టింగు ఎంఎల్ఏలకే మళ్ళీ టికెట్లు ఇవ్వద్దని పార్టీలోని నేతలు, క్యాడర్ ఎంత మొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. సిట్టింగులకే టికెట్లు ఇవ్వటంలో కేసీయార్ కోణం ఏమిటంటే వీళ్ళెక్కడ ఎదురు తిరుగుతారో అని భయపడ్డారు.
సిట్టింగులు ఎదురు తిరిగి పార్టీకి రాజీనామా చేసినా లేదా రెబల్ అభ్యర్ధులుగా పోటీచేసినా అదీకాకపోతే అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ ఓడిపోవటం ఖాయమని కేసీయార్ భయపడ్డారు. అందుకనే ఎంత వ్యతిరేకత ఉన్నా సిట్టింగులకే మళ్ళీ టికెట్లిచ్చింది. దీంతో ఏమైందంటే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. చాలా నియోజకవర్గాల్లో ప్రచారానికి వస్తున్న ఎంఎల్ఏలను ఊర్లలోకి కూడా రానీయకుండానే తరిమేస్తున్నారు. అవినీతి, అరాచకాలకు అదనంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో భారీ ఎత్తున అవకతవకలు బయటపడ్డాయి. నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు, తమ మద్దతుదారులకే ఎంఎల్ఏలు పథకాలను వర్తింప చేయించుకున్నారు.
ఇలాంటి అనేక కారణాలతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ప్రచారానికి వస్తున్నారంటేనే జనాలంతా మండిపోతున్నారు. వీటన్నింటికీ అదనంగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేపథకాల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. రైతురుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటిలకు ఆర్ధికసాయం ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా ప్రచారార్బాటమే కానీ అమలు జరగటంలేదు. ఇన్ని వ్యతిరేకతల మధ్య ఎంఎల్ఏలు ప్రచారానికి వస్తుంటే జనాలు తీవ్రంగా వ్యతిరేకించకుండా హారతులిచ్చి స్వాగతాలు పలుకుతారా ? చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates