తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారు హఠాత్తుగా రాజకీయాల్లో భాగంగా ఊహించని నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారుతోంది. ఇదే ఒరవడిలో ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులారిటీ ఉన్న రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) గులాబీ గూటికి చేరారు. తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే, బిత్తిరి సత్తి బీఆర్ఎస్ చేరిక వెనుక మంత్రి హరీశ్ రావు పెద్ద కసరత్తే చేశారంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి వీర అభిమానిగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ తరుపున టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ తిరిగి సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున గలం వినిపించారు. పైగా తనకు టికెట్ దక్కకపోవడం విషయంలో మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. దీంతో నీలం మధుకు కౌంటర్‌గా హరీశ్ తనదైన శైలిలో మంత్రాంగం నడిపించారు.
ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన బిత్తిరి సత్తి అలియస్ రవికుమార్‌కు తెలంగాణ యాస, భాషపై పట్టుండటమే కాకుండా ఇటు టీవీ వీక్షకుల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే నీలం మధు వల్ల కలిగిన నష్టం పూరించుకోవచ్చునని హరీశ్ లెక్కలు వేశారు. ఆయనతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గురువారం భేటీ ఏర్పాటు చేయించారు. అనంతరం నేడు పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ కండువా కప్పారు.