జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజాలపై తుపాకీ పెట్టి.. తాము విజయం దక్కించుకోవాలని.. లేదా కనీసం గౌరవ ప్రదమైన స్థానాలనైనా సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు అంతంత మాత్రమే. అది కూడా అభ్యర్థుల ఇమేజ్‌తోనే పార్టీ నెట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2018లో ఘోషామహల్ విజయం దక్కినా.. తర్వాత.. జరిగిన ఉప పోరుల్లో.. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపు లభించినా బీజేపీ బలం కాదు.. అభ్యర్థుల బలమేనన్నది జగమెరిగిన సత్యం.
ఇక, ఇప్పుడు కనీసం 25-50 స్థానాల్లో అయినా విజయం దక్కించుకుంటే తమ ఉనికిని తాము కాపాడుకున్నట్టుగా అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే పవన్‌ను తమకు తురుపు ముక్కలా వినియోగించుకోవాలనే భావనతో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇంతగా ఆధారపడిన పవన్‌ను ఎలా చూసుకోవాలి? ఏ విధంగా ఆయనను మచ్చిక చేసుకోవాలి? అనే అంశాలు కీలకంగా మారాయి. కానీ, బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ఆ విధంగా చూడడం లేదని చెబుతున్నారు.
టికెట్ల నుంచి చర్చల వరకు కూడా.. పవన్‌తో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. కనీసం 20 స్థానాల్లో అయినా తమకు అవకాశం ఇవ్వాలని పవన్ కోరుతున్నారు. అయితే..ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అత్యంత అవమానకర రీతిలో 4 స్థానాలను మాత్రమే కేటాయిస్తామని చెప్పడం.. ఈ మేరకు మాత్రమే పరిమితం కావాలని తాజాగా అమిత్ షాతో జరిగిన చర్చల్లో తేల్చి చెప్పడం పవన్‌కు అవమాన భారంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
పవన్‌పై ఆధారపడి.. పవన్ ఇమేజ్‌ను వినియోగించుకునేందుకు సిద్ధపడిన బీజేపీ నాయకులు.. ఇలా చేయడం ఏమేరకు సమంజసమనేది చర్చనీయాంశంగా మారింది. పైగా కొన్ని షరతులు కూడా పెట్టారనే వాదన ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి బీజేపీ.. తనను తాను పెద్దగా ఊహించుకుని, పవన్‌ను తక్కువగా అంచనా వేస్తోందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయంలో పవన్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే.. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే.. పవన్‌కు ఇబ్బందేనని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates