సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. మేడిగడ్డ బ్రిడ్జి కాదు…కేసీఆర్ ప్రభుత్వమే కుంగిపోయే పరిస్థితి వచ్చిందని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు-కేటీఆర్ లు బిల్లా-రంగా వంటి వారని, కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ వంటి వారని ఎద్దేవా చేశారు. వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
ఈడీ, సీబీఐ లు బిజెపికి ఫ్రంట్ ఆర్గనైజేషన్లని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను నవంబరు 2వ తేదీలోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని రేవంత్ అన్నారు. అంతేకాకుండా, రిటైర్డ్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. రిటైర్డ్ అధికారులతో నయా రజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని రేవంత్ ఆరోపించారు. కొందరు అధికారులు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణ టీం లాగా పనిచేస్తున్నారని, అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పామని అన్నారు.
మళ్ళీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయాయని ఆరోపించారు. కానీ, కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరపాలని, అప్పుడే అసలు విషయం బయటకు వస్తుందని అన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను బయట పెట్టడం లేదని, కేంద్రానికి బీఆర్ఎస్ కి ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి ప్రొటెక్షన్ చెల్లించారు కాబట్టే కేసీఆర్ తప్పులపై మోడీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
జనసేన-బీజేపీ పార్టీల పొత్తును తాము ఏ కోణంలో కూడా చూడడం లేదని, అవసరమైతే ప్రజాశాంతి పార్టీని కూడా కలుపుకొని వెళ్లాలని బిజెపి-జనసేన పొత్తులపై కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.