నాదెండ్లపై ఆలపాటి మండిపోతున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ పై సీనియర్ తమ్ముడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే తెనాలిలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు ఆలపాటిని పిలవకపోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే నాదెండ్లది, ఆలపాటిది ఇద్దరిదీ తెనాలి నియోజకవర్గమే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండు పార్టీల నుండి ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది.

తాజా పరిణామంతో తెనాలిలో టికెట్ ఇద్దరిలో ఎవరికి దక్కుతుందనే విషయంలో రెండు పార్టీల్లోను అయోమయం పెరిగిపోతోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఆలపాటికి టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో ఆలపాటి లాంటి సీనియర్ నేతలు ఇంకా చాలా మందున్నారు. కానీ జనసేనలో నాదెండ్ల లాంటి నేత మరొకరు లేరు. పైగా నాదెండ్లకే టికెట్ దక్కలేదంటే అది పవన్ కే అవమానం. కాబట్టి తెనాలిలో జనసేన పోటీచేసేట్లుగా పవన్ పట్టుబడతారనటంలో సందేహంలేదు.

పవన్ పట్టుబట్టి తెనాలి టికెట్ ను నాదెండ్లకే ఇప్పించుకుంటారు. ఇదే సమయంలో తెనాలి నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు కూడా పట్టుబడతారని ఎవరు అనుకోవటంలేదు. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే నాదెండ్ల తాజాగా తెనాలిలో పార్టీ ఆపీసును ప్రారంభించారు. ఇప్పటికే నాదెండ్లకు పార్టీ ఆపీసు ఉన్నప్పటికీ ఇపుడు తెరిచిన పార్టీ ఆపీసు మాత్రం రెండు పార్టీలకు సంబంధించినది. అంటే టీడీపీ-జనసేన జాయింట్ ఆఫీసనే అనుకోవాలి. ఆఫీసు ప్రారంభోత్సవానికి జనసేనతో పాటు టీడీపీలోని ముఖ్యనేతలను నాదెండ్ల ఆహ్వానించారు.

ఇంతమందిని ఆహ్వానించిన నాదెండ్ల కావాలనే ఆలపాటిని మాత్రం దూరంగా పెట్టారు. దాంతో నాదెండ్లపై ఆలపాటి బాగా మండిపోతున్నారు. టికెట్ విషయంలో చివరకు ఏమవుతుందో ఇపుడే ఎవరూ చెప్పలేరు కాబట్టి ఆలపాటి తనపాటికి తాను నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెనాలి నుండి పోటీచేయబోయేది తానే అని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇదే పద్దతిలో నాదెండ్ల కూడా ప్రచారం చేసుకుంటుండటంతో రెండుపార్టీల్లోని నేతలు, క్యాడర్లో అయోమయం పెరిగిపోతోంది. తమ్ముళ్ళ సమాచారం ఏమిటంటే టికెట్ దక్కకపోతే ఇండిపెండెంటు అభ్యర్ధిగా అయినా పోటీచేయటానికి ఆలపాటి రెడీ అయిపోయారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.