మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌లు కొంప‌ముంచేట్టున్నాయే!

మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ ద‌ళిత‌ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్దేశంలో త‌న వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు మేలు చేస్తాయ‌ని అనుకుని ఉండొచ్చు. కానీ, ఇప్ప‌టికే ఉప్పు-నిప్పుగా ఉన్న కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మోత్కుప‌ల్లి మ‌రో విప‌త్తుకు తెర‌దీశార‌నే చ‌ర్చ సాగుతుండడం గ‌మ‌నార్హం. తాజాగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.

తెలంగాణ‌లో జ‌రుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం ఎక్కితే రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతార‌ని, అవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఆయ‌నకే అధిష్టానం మొగ్గు కూడా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేవంత్‌రెడ్డి హ‌యాంలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంద‌ని.. చెప్పుకొచ్చారు. అయితే, వాస్త‌వానికి ముఖ్య‌మంత్రి రేసులో ముగ్గురు నుంచి న‌లుగురు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

వీరంతా త‌మ త‌మ మందీమార్బ‌లాల‌తో బ‌హిరంగ ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు. ఇక‌, కాంగ్రెస్ అధిష్టానం ఈ విష‌యంలో మౌనంగా ఉంది. ముందు గెలిచాక‌.. త‌ర్వాత ముఖ్య‌మంత్రి పీఠంపై నిర్ణ‌యం తీసుకునేలా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇంత‌లో మోత్కుప‌ల్లి రేవంత్‌ను ఎత్తేస్తూ.. ఆయ‌నే సీఎం అవుతార‌ని.. ఆయ‌న‌కు సీఎం సీటు ఇవ్వ‌క‌పోతే.. అన్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని, ఇక‌, కాంగ్రెస్‌ను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని వ్యాఖ్యానించ‌డం పార్టీలో మ‌రో చిచ్చుకు దారితీసే ప్ర‌మాదం ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఇదిలావుంటే, సీఎం కేసీఆర్‌పై మ‌రోసారి మోత్కుప‌ల్లి విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఆరోగ్యం బాగోలేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని.. రేపో మాపో ఆయ‌న ఆసుప‌త్రిలో చేర‌తార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌ని, అలాంటి నాయ‌కుడికి ఓట్లేస్తే.. మ‌ళ్లీ కుటుంబ పాల‌నే వ‌స్తుంద‌ని మోత్కుప‌ల్లి చెప్పుకొచ్చారు. ప‌దేళ్లు కేసీఆర్ కు అవ‌కాశం ఇచ్చింది చాల‌ని.. దొర‌ల పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని వ్యాఖ్యానించారు.