ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు ‘‘ఏపీ హేట్స్ జగన్’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో అంటున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, నాసిరకం మద్యంతో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని హామీలు జగన్ నెరవేర్చ లేదని, సీపీఎస్ రద్దు , ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ మాట తప్పారని ఎద్దేవా చేశారు.
3 రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రకృతి వనరుల్ని కబళించడానికే రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారని జోస్యం చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, కోర్టులు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని, విచారణ సంస్థలను ప్రశ్నించడం లేదని అచ్చెన్న ధ్వజమెత్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates