తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలూ అభ్యర్థులను ప్రకటించడం, వారికి బీఫారా లు ఇవ్వడం వంటివి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. పార్టీ ఎంత ఖచ్చితంగా రూల్స్ పెట్టినా.. ఎన్నికమిటీలు వేసినా.. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన తర్వాత కూడా అసంతృప్తి రగులుతూనే ఉంది. కొందరు నాయకులు టికెట్ల వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారిలో మాజీ మంత్రి, మైనారిటీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఒకరు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి నుంచి ఆయనకు టికెట్ కేటాయించారు. మొదట్లో ఈ విషయంపై షబ్బీర్ ఆందోళన పడకపోయినా.. ఇక్కడ అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహం డిఫరెంట్గా ఉండడంతో ఆయన ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ దఫా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ స్తున్న విషయం తెలిసిందే.
వీటిలో ఒకటి గజ్వేల్ నియోజకవర్గం కాగా, మరొకటి కామారెడ్డి. గజ్వేల్ పరిస్థితిలో కొంత తడబాటు కనిపిస్తుండడంతో సీఎం కేసీఆర్ మనసంతా కామారెడ్డిపై పెట్టారు. ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు తొలిసారి సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ రాజకీయ పవనాలు, ప్రజల నాడి కూడా ఆయనకు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా ఆసక్తిగా మారాయి.
దీంతో కాంగ్రెస్ తనకు కామారెడ్డి టికెట్ ఇచ్చినా.. సీఎం కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేస్తుండడంతో షబ్బీర్ అలీ వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కామారెడ్డి సీటు వద్దని.. ఎల్లారెడ్డి సీటు కేటాయించాలని ఆయన కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే ఎల్లారెడ్డి టికెట్ ను కూడా కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసింది. మదన్మోహన్‌రావుకి ఎల్లారెడ్డి టికెట్ ఇచ్చింది.
దీంతో మదన్మోహన్‌రావును అక్కడ నుంచి తప్పించి.. కామారెడ్డికి పంపించాలని.. తనకు ఎల్లారెడ్డి టికెట్ ఇవ్వాలని షబ్బీర్ అలీ.. తీవ్రస్థాయిలో మంతనాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్‌పై పోటీకి షబ్బీర్ అలీ భయపడుతున్నారా? లేక కేసీఆర్ గెలుపును ఆయన ముందుగానే అంచనా వేస్తున్నారా? అన్నది చూడాలి.