ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి మాట్లాడితే.. అందరూ తన వైపు ఆసక్తిగా చూసేలా చేయగల నాయకుడు ఎవరు అంటే మరో మాట లేకుండా రఘురామకృష్ణం రాజు పేరు చెప్పేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువగా విరుచుకుపడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఆ పార్టీకే చెందిన ఈ ఎంపీ.
ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కూడా చేయించుకున్న రఘురామ.. అప్పట్నుంచి మరింతగా స్వరం పెంచుతున్నారు. తాజాగా ఆయన మరోసారి ఏపీ అధికార పార్టీ, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైకాపా నేతల నుంచి తనతో పాటు వివిధ వర్గాల వాళ్లకు వస్తున్న బెదిరింపులు, వేధింపుల గురించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. మీ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన చిటికేసి వైకాపా నేతలకు సవాలు విసిరారు.
పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేసిన డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యుడికి ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌కు పేరుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఓ దళిత యువకుడు మద్యంపై మాట్లాడితే ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరిస్తే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొస్తున్నాయని.. ఇలా ప్రాణాలు తీసుకోవడం బాధాకరమని, ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఆయనన్నారు. తనకూ బెదిరింపులు వస్తున్నాయని.. ఎవరూ చలించకండని.. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరని.
ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని అన్నారు. తనను సోషల్ మీడియాలో ఓ మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడందని.. అవి ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావవి.. ఐతే ఇలా ఎన్నిరకాలుగా ఏం చేసినా ప్రయోజనం లేదని చిటికేసి చెప్పారు రఘురామక కృష్ణంరాజు.