చంద్ర‌బాబు కోసం మ‌ళ్లీ క‌దం తొక్కిన టెకీలు..

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టు, ఆయ‌న‌ను జైలులో పెట్ట‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లే కాకుండా.. చంద్ర‌బాబుకు ద‌న్నుగా నిర‌స‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఇది ఏపీకి సంబంధించిన వ్య‌వ‌హార‌మే అయిన‌ప్ప‌టికీ.. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌తో ఐటీ రంగంలో ఉద్యోగాలు పొంది.. సుస్థిర జీవ‌నాల‌ను గ‌డుపుతున్న వారు.. ఎక్క‌డ ఉన్నా.. బాబుకు మ‌ద్ద‌తుగా రోడ్డెక్కుతున్నారు. ఆయ‌న అరెస్టును, జైలును కూడా ఖండిస్తున్నారు.

ఏపీ స‌ర్కారు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు, తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనూ టెకీలు నిర‌స‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. గ‌తంలో ఈ నిర‌స‌న‌ల‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతేకాదు.. ఆయా సంస్థ‌ల నుంచి ఉద్యోగుల‌కు తాఖీదులు కూడా పంపించారు. దీంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు స్త‌బ్దుగా ఉన్నారు.

అయితే.. తాజాగా చంద్ర‌బాబు ఆరోగ్యంపై స‌ర్వ‌త్రా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ టెకీలు శ‌నివారం మ‌రోసారి క‌దం తొక్కారు. ‘లైట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌’ పేరుతో హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో.. టీడీపీ కార్యకర్తలతో క‌లిసి ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో ప‌లు మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద హైటెన్షన్ వాతావరణం సైతం నెలకొంది. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని చెబుతుండ‌డంతో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగిన బాబు అభిమానులు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఈ క్ర‌మంలో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని బాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు న‌ల్ల ష‌ర్టుల‌తో భారీగా నిరసన కారులు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు.

ఈ నిర‌స‌న‌లు, పోలీసుల ఆంక్ష‌ల నేప‌థ్యంలో టెక్నికల్ రీజన్ అంటూ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. దీంతో మెట్రో అధికారులతోనూ చంద్రబాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ప‌రిస్థితి హైటెన్ష‌న్‌గా మార‌డం గ‌మ‌నార్హం.