టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు ప్రాంతంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తలకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులు నమోదు చేశారు. అంగళ్లు కేసులో ఏ1గా చంద్ర బాబును పేర్కొన్నారు. ఆయన రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాల కారణంగానే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని, పోలీసులకు గాయాలయ్యాయని కేసులో పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు టీడీపీ కీలక నాయకులపైనా కేసులు పెట్టడం.. వారిని అరెస్టు చేయడం తెలిసిందే. అయితే. వీరిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక, ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ జైలులో ఉంచిన చంద్రబాబుపై అంగళ్లు కేసు పోలీసు విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో బెయిల్ లభించినా.. అంగళ్లు కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావించాయి. ఇదే విషయంపై చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా కొన్నాళ్లుగా దీనిపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, లక్ష రూపాయల పూచీకత్తును సమర్పించాలని షరతు విధించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates