కేంద్ర మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు, జైలు అంశాల్లో ఒక్క‌సారిగా కీల‌క మ‌లుపు, కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు అరెస్టు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల‌ని చేసిన టీడీపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. తాజాగా కేంద్ర హొం మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షాతో టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు, త‌న తండ్రి, మాజీ సీఎం చంద్ర‌బాబును అరెస్టు చేసిన తీరు వంటివి ఆయ‌న వివ‌రించిన‌ట్టు తెలిసింది.

ఢిల్లీలోని టీడీపీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత విష‌యంలో కక్షసాధింపు చర్యలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి నారా లోకేష్ తీసుకువెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ స‌హా ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కు సంబంధించి విచారణ పేరుతో తనని వేధిస్తున్నార‌ని, జగన్ కక్ష సాధింపు చర్యలు చేప‌డుతున్నార‌ని అమిత్ షాకు లోకేష్ వివ‌రించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయ‌న వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా అమిత్ షా.. మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగి తెలుసుకున్నారు. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్ర‌య‌ల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి లోకేష్ వివ‌రించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయ‌ప‌డిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. ఇదే సమ‌యంలో ప్ర‌స్తుతం చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకున్నార‌ని పేర్కొన్నాయి.

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాన‌ని అమిత్ షా లోకేష్‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే.. నారా లోకేష్‌కు త‌క్ష‌ణం ఎలాంటి హామీ ఇచ్చార‌నేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, ఈ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక‌, ఇదే విష‌యాన్ని నారా లోకేష్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా పంచుకున్నారు. తాను అమిత్ షాతో భేటీ అయ్యాన‌ని, ఏపీలో జ‌రుగుతున్న అరాచ‌క పాల‌న‌, క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌పై అమిత్ షాకు వివ‌రించాన‌ని పేర్కొన్నారు.