తెలంగాణ ప్ర‌జ‌ల మొగ్గు దేనికి!?

ఒక‌వైపు ఈటెల వంటి మాట‌లు. మ‌రో వైపు.. అన్ని వ‌ర్గాలకు మేలు చేస్తున్నామ‌నే చేతలు. అంటే అటు మాట‌లు-ఇటు చేత‌లు.. రెండు కూడా ఒక్కుమ్మ‌డిగా తెలంగాణ ప్ర‌జ‌ల‌పై అన్ని ప్ర‌ధాన పార్టీలు సంధిస్తు న్న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రాలు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతారు? ఏ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విష‌యంలో అటు అధికార పార్టీ బీఆర్ ఎస్‌, ఇటు ప్ర‌తిప‌క్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

“ద‌ళిత బంధు వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాన్ని మేమే తీసుకువ‌చ్చాం” అని చెబుతున్న అధికార పార్టీ బీఆర్ ఎస్ ఒక‌వైపు, గిరిజ‌న యూనివ‌ర్సిటీ స‌హా రాష్ట్రాభివృద్ధికి తామే నిధులు ఇచ్చామ‌ని చెబుతున్న బీజేపీ మ‌రో వైపు ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో ఈ రెండు పార్టీలు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు కూడా చేసుకుంటున్నాయి. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డం కోస‌మే కేసీఆర్ త‌హ‌త‌హ లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి అమిత్ షా విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. తాము అభివృద్ధి చేస్తే.. ఆ ఫ‌లాలు..తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా ఒక కుటుంబ‌మే సొంతం చేసుకుంటోంద‌ని కూడా షా నిప్పులు చెరిగారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో బీఆర్ ఎస్ కూడా మోడీ స‌ర్కారుపైనా.. ఆయ‌న విధానాల‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ విమ‌ర్శ‌లు.. హామీల ప‌రంప‌ర‌లో కాంగ్రెస్ పార్టీ ఒకింత వెనుక‌బ‌డిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నా.. అధికారంలోకి వ‌స్తే.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఉచిత‌ వంట గ్యాస్ సిలిండ‌ర్లు, నెల‌నెలా ల‌బ్ధి వంటి హామీల‌తో ఆ పార్టీ కూడా దూకుడుగానే ఉంది.

మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టికే ఉన్న బీఆర్ ఎస్ స‌ర్కారు నుంచి త‌మ‌కు అందుతున్న ల‌బ్ధి ఒక‌వైపు, మ‌రో పార్టీకి ప‌ట్టం క‌డితే.. మ‌రింత ల‌బ్ధి చేకూరుతుంద‌న్న ఆశ మ‌రోవైపు తెలంగాణ ఓట‌రు నాడిని త‌ర్జ‌న భ‌ర్జ‌న కు గురి చేస్తోంది. ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే.. అన్న‌ట్టుగా ఇంకా ఏదైనా ఇస్తామ‌నే పార్టీవైపు మొగ్గు చూపుతారా? లేక‌, ఇప్పుడు ఇస్తున్న పార్టీ బీఆర్ ఎస్ వైపు తెలంగాణ ఓటరు మొగ్గు చూపుతాడా? అనేది రాజ‌కీయ పండితుల‌కు కూడా అంతు చిక్క‌ని సంగ‌తిగా మారిపోయింది. మ‌రి తెలంగాణ ఓట‌రు ఎటు నిల‌బ‌డ‌తాడో చూడాలి.