ఫైబర్ నెట్ వాస్తవాలతో టీడీపీ పుస్తకం: అచ్చెన్న

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఏపీ ఫైబర్ నెట్ స్కాం ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ల పై సీఐడీ విచారణ జరిపే అవకాశముంది. ఈ క్రమంలోనే అసలు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ఏమిటి అన్న విషయాలను తెలియజేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ‘ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చింది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ పుస్తకాన్ని మంగళగిరిలో విడుదల చేశారు. చంద్రబాబు ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని, తమ నేతకు అవినీతి మరక అంటుకునే అవకాశమే లేదని అచ్చెన్న చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 30 రోజులైందని, ఒక్క పైసా అవినీతి జరిగిందని కూడా నిరూపించలేకపోయారని పయ్యావుల ఎద్దేవా చేశారు.

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని జగన్ కు, మిగతా వారికి కూడా తెలుసని, కక్ష సాధింపులో భాగంగానే కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారని పయ్యావుల విమర్శించారు.