రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు.. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడేందుకు సై అంటున్నారు.. ఇదీ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ పారి ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనా ఈ సారి తనకు టికెట్ వద్దని బండ్ల గణేష్ చెప్పేశారు.
2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో బండ్ల గణేష్ చేరారు. అప్పుడు తన సొంత నియోజకవర్గమైన షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపిఐ కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. మహా కూటమికి మెజారిటీ వస్తుందని, కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు వస్తాయని అప్పుడు బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోవడంతో గణేష్ మాట మార్చారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ యాక్టివ్ అయ్యారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గణేష్ ను కూకట్ పల్లిలో పోటీచేయిస్తే సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావించినట్లు తెలిసింది. దీంతో టికెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కానీ గణేష్ మాత్రం పోటీ చేయనని ట్విటర్ ద్వారా ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తానని చెప్పారు కానీ ఈ సారి టికెట్ వద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పని చేస్తానని గణేష్ వెల్లడించారు.