రేవంత్ రెడ్డి కాదు..రేటెంత రెడ్డి: కేటీఆర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓటుకు నోటు ఇప్పుడేమో సీటుకోరేటు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయనను రేవంత్ రెడ్డి అనడం లేదని రేటెంత రెడ్డి అంటున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని. కాంగ్రెస్ పార్టీకి అలాంటి దుస్థితి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పైసలు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తున్నారని లొల్లి జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికలైనా మరునాడు గెలిచిన పదో పన్నెండో ఎమ్మెల్యేలతో ఇదే రేవంత్ రెడ్డి బిజెపిలో చేరకపోతే తనను నిలదీయాలని, ఈ విషయం రాసి పెట్టుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి అని, 1999లో కార్వాన్ లో పోటీ చేసిన కిషన్ రెడ్డికి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకు బిజెపితో తెరచాటు చీకటి వ్యాపారాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని, ఆ గాడ్సేను గాంధీభవన్లో కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలేనని, మైనార్టీలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఏ పార్టీకి బీ టీమ్ అవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదని, తమది ప్రజల టీం అని కేటీఆర్ చెప్పారు. 23 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామని, తెలంగాణలో ప్రజల ఏ టీం బీఆర్ఎస్ అని చెప్పారు. కేంద్రంలో తమ పాత్ర లేనిదే ప్రభుత్వాలు ఏర్పడని పరిస్థితిని తీసుకొస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.