చంద్రబాబు కోసం నిరాహార దీక్ష..తలసాని సంఘీభావం

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో కూడా చంద్రబాబు అభిమానులు, టిడిపి నేతలు, కార్యకర్తలు పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సనత్ నగర్ లో ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆ నిరాహార దీక్షలో అన్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ దీక్షకు సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించిన తలసాని దీక్ష కొనసాగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. తలసాని రాకతో టీడీపీ దీక్షా శిబిరం వద్ద కోలాహలం ఏర్పడింది. కొద్దిసేపు అక్కడే ఉన్న తలసాని ఆ తర్వాత వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా జగన్ పై రామకృష్ణ నిప్పులు చెరిగారు. ప్రజలకు ముద్దులు పెట్టి దోచుకున్న వాడేమో ప్యాలెస్ లో ఉన్నాడని…పేద ప్రజలకు ముద్ద పెట్టినవాడేమో జైలు పాలు అయ్యాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు దగా, మోసం అని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. అన్నగారి అడుగుజాడల్లో చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించారని గుర్తు చేశారు.

స్కీమ్ లేదు పాడు లేదు ఇదంతా కట్టు కథ అని రామకృష్ణ ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో చెప్పిన విషయాలు మళ్లీ మళ్లీ చెబుతున్నారంటూ జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందని ఆరోపించారు. ముందు మూడు వేల కోట్లు అన్నారని, ఆ తర్వాత 371 కోట్లు అంటున్నారని, ఇప్పుడేమో 27 కోట్ల నిధులు దారి మళ్లాయి అని చెబుతున్నారని అన్నారు. ముందు చంద్రబాబు ఖాతా అని ఇప్పుడేమో టిడిపి ఖాతా అని అంటున్నారని, అసలు వాళ్ళ దగ్గర ఆధారాలు లేవని రామకృష్ణ ఆరోపించారు.

చంద్రబాబు మచ్చలేని నాయకుడని, ఏ తప్పు చేయలేదు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదని అన్నారు. చంద్రబాబు రాజకీయాలలోకి రాకుంటే టాటా, బిర్లా రేంజ్ లో ఉండేవారని, ప్రజాసేవ కోసం తన జీవితాన్ని చంద్రబాబు అంకితం చేశారని ప్రశంసించారు.