ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారుతోంది. గత నెల రోజుల్లో ఎంత వేగంగా పరిణామాలు మారిపోయాయో తెలిసిందే. కొన్ని నెలల తర్వాత కానీ క్లారిటీ రాదనుకున్న తెలుగుదేశం-జనసేన పొత్తు విషయమై గత నెలలోనే స్పష్టత వచ్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు అరెస్టు అయిన కొన్ని రోజులకే పవన్ స్వయంగా పొత్తును అధికారికంగా ప్రకటించాడు.
ఐతే పవన్ ప్రకటన అయితే చేశాడు కానీ.. టీడీపీ నాయకులు ఆయనంత ఓపెన్‌గా ఉంటారా.. జనసేనకు బాసటగా నిలుస్తారా.. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్.. పవన్ విషయంలో చాలా సానుకూలంగా మాట్లాడ్డం.. వారాహి యాత్రకు కూడా మద్దతు ప్రకటించడం.. ఈ యాత్ర సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి సాగడం.. పవన్ కూడా టీడీపీ విషయంలో మళ్లీ మళ్లీ సానుకూలంగా మాట్లాడడంతో రెండు పార్టీల మధ్య మంచి సమన్వయమే కనిపిస్తోంది.
ఇక ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య అంతరం పెంచడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవడం తప్ప వైసీపీకి మరో మార్గం కనిపించడం లేదు. ఇక తేలాల్సిందల్లా బీజేపీ ఎటు వైపు ఉంటుందన్నదే. గత నాలుగేళ్లలో పరిణామాలు గమనిస్తే.. అధికారికంగా పొత్తు జనసేనతో అయినా, వైసీపీకే బీజేపీ ఎక్కువ సహకరించిన సంకేతాలు కనిపించాయి. తమతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీతో కలిసి సాగాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. కాగా పవన్ తాజాగా వారాహి యాత్రలో తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పేశాడు. ఇలాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ప్రకటిస్తాడేమో అనుకున్నారు. కానీ పవన్ యాత్రలో.. తన ప్రసంగం మధ్యలో ఈ మాట చెప్పడం చర్చనీయాంశం అయింది. అధికారికంగా ప్రకటన చేసి.. దీన్ని చర్చనీయాంశం చేయడం, అలాగే బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడం పవన్‌కు ఇష్టం లేదన్నట్లు కనిపిస్తోంది.
అదే సమయంలో బీజేపీతో కలిసి వెళ్తే మైనారిటీ ఓట్లు పడవన్న భయం కూడా ఉన్నట్లుంది. ఇటీవలి సర్వేల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్తే టీడీపీ, జనసేన కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువన్న సంకేతాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి పవన్ దూరం జరగాలని నిర్ణయించుకున్నాడు. వైసీపీ కూడా అధికారికంగా బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. కానీ బీజేపీతో వైసీపీ అనధికారిక బంధంలో ఉన్నట్లు జనం ఇప్పటికే ఫిక్సయిపోయారు. బీజేపీ పట్ల మెతక వైఖరిని కొనసాగిస్తే.. ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం కూడా చేయొచ్చు. ఇక ఏపీలో తేలాల్సిందల్లా వామపక్షాలు ఎవరి వైపు ఉన్నారన్నదే. అది కూడా తేలిపోతే.. ఎన్నికల ముఖచిత్రంపై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే.