తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు కసరత్తు జరుగుతోంది. రెండు పార్టీల నుంచి సీనియర్ నేతలు కూర్చుని ఇదే విషయమై కసరత్తు చేస్తున్నట్లు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. కృష్ణాజిల్లాలోని పెడనలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా కష్టంగానే ఉన్న తప్పనిస్ధితిలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు పవన్ చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు వీలుగా పవన్ ఎన్టీయేలో నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టంగా చెప్పారు.
అంటే పవన్ తాజా ప్రకటన ప్రకారం ఇకనుండి బీజేపీ-జనసేన మిత్రపక్షాలు కావు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు వీలుగానే బీజేపీతో బంధాన్ని పవన్ తెంపేసుకున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో చంద్రబాబును కలిసొచ్చిన దగ్గర నుండి పవన్ వైఖరిలో మార్పొచ్చేసింది. చంద్రబాబును కలిసొచ్చిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలను ఎదుర్కొంటాయని ప్రకటించారు.
అప్పుడు చేసిన ప్రకటనతోనే బీజేపీతో పొత్తును తెంచుకోబోతున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. అయితే బీజేపీతో విడిపోయే విషయాన్ని పవన్ ప్రకటించలేదు. అప్పటినుండి పొరబాటున కూడా బీజేపీ ప్రస్తావన ఎక్కడా తేవటం లేదు. ఢిల్లీకి వెళతానని, బీజేపీ పెద్దలను కలుస్తానని, చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలను వివరిస్తానని ఎన్నిసార్లు చెప్పినా అడుగు ముందుకేయలేదు. బహుశా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల హస్తముందని పవన్ కు సమాచారం ఉందేమో. అందుకనే బీజేపీ పెద్దలను కలిసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అనుకునుంటారు.
ఇందుకనే ఢిల్లీ పర్యటన పెట్టుకోలేదు. కారణాలు ఏవైనా తాజా పర్యటనలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించేశారు. ఇందుకనే టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో తొందరలోనే రిలీజవ్వబోతున్నట్లు చెప్పింది. మరి వీళ్ళ పొత్తులో చేరటానికి వామపక్షాలు రెడీగా ఉన్నాయి. వాటిని కలుపుకునే విషయంలో చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. యాత్రకు ముందే పవన్తో టీడీపీ సినియర్ నేతలు భేటీ అవటం ఇందులో భాగమేనేమో. పవన్ తాజా ప్రకటనతో రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates