రాహుల్ లో సమూలమైన మార్పు

తిరుగులేని నేతగా ఎదగాలంటే జనాల మద్దతు ఉండాల్సిందే అని రాహుల్ గాంధీకి ఇంతకాలానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇన్ని సంవత్సరాల అంతఃపురం రాజకీయాలను వదిలేసి రోడ్లమీదకు వచ్చారు. తాజాగా రెండురోజులుగా పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో ఉంటున్నారు. స్వర్ణదేవాలయంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. అన్నదానం అంటే అన్నం పెడతారని కాదు రొట్టెలే ముఖ్యం. ప్రతిరోజు దేవాలయానికి రకరకాల జనాలు వస్తుంటారు. స్వర్ణదేవాలయం అంటే పంజాబ్ ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాశాలు.

అందుకనే రెండురోజులుగా రాహుల్ దేవాలయంలోనే గడిపారు. వంటగదిలో కూర్చుని మిగిలిన వాళ్ళతో కలిసి రొట్టెలు, దాల్, చావల్ చేశారు. తర్వాత వంటపాత్రలు కడిగారు. భక్తులకు భోజనం వడ్డించారు. దేవాలయం ఆవరణను శుభ్రం చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులను కలిసి మాట్లాడారు. దేవాలయంలోనే భక్తులతో కలిసి భజనలు చేశారు. ఇదంతా రాహుల్ చేసింది ఫక్తు రాజకీయం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రాజకీయ నేతలు రాజకీయమే చేస్తారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మామూలు భక్తుల్లాగ రాహుల్ స్వర్ణదేవాలయంలో మిగిలిన అందరితో కలిసిపోవటమే. ప్రజల్లో ఒకడిగా మమేకం అయిపోయినపుడే జనాలు కూడా రాహుల్ ను గుర్తుంచుకుంటారు. అందుకనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్రచేసింది. పాదయాత్ర చేయటమే రాహుల్ దృక్పదాన్ని మార్చిందని చెప్పాలి. అప్పటినుండే ట్రక్కు డ్రైవర్ గా, మెకానిక్కుగా, దాబాల్లో భోజనం, లారీల్లో ప్రయాణం, గ్రామీణ ప్రాంతంలోని యువకులతో కలిసి వంటలు తయారుచేయటం లాంటి అజెండాతో చొచ్చుకుని పోతున్నారు.

ఇలాంటి అజెండానే రాహుల్ ను సామాన్య జనాలకు దగ్గరచేస్తున్నది. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే జనాలను కలవటం, సమస్యలపై చర్చించటం, పరిష్కారాలపై మాట్లాడటం అన్నది ప్రతిపక్షంలో ఉన్నపుడే సాధ్యమవుతుంది. పొరబాటున అధికారంలోకి వచ్చేస్తే ఈపనులన్నీ సాధ్యంకాదు. ఈ విషయాన్ని రాహుల్ కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఎలాగుంటుందన్నది ఎన్నికల ఫలితాలు వస్తేకానీ తెలీదు. ఈలోపు జనాల మనిషి అనిపించుకోవటమే రాహుల్ కు చాలా ముఖ్యం.