అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. “నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు” అని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. మరుసటి రోజు ఫోన్ చేసి.. ట్రంప్‌ను అభినందించారు. దీనిని కూడా ప్రజలకు వివరించారు. ప్రియ మిత్రుడి కారణంగా.. అమెరికా-భారత్ బంధం మరింత బల పడుతుందన్నారు. కట్ చేస్తే.. ట్రంప్ ప్రమాణం చేసి పట్టుమని 15రోజులు కూడా కాకముందే.. భారత్‌కు అవమాన కరమైన పనిచేశారు.
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారంటూ.. ఇతర దేశాలకు చెందిన వారిని అగ్రరాజ్యం నుంచి రాత్రికి రాత్రి తరిమేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇలా వీరిని వదిలించుకునే క్రమంలో కనీసం మానవ హక్కులను కూడా ట్రంప్ పట్టించుకోవడం లేదు. అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి.. వారిని ఆర్మీ విమానాల్లో ఇతర దేశాలకు పంపిస్తున్నారు. వీరికి దారిలో కనీసం మంచి నీళ్లు కానీ, ఆహారం కానీ ఇవ్వడం లేదు. దీనిని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
కానీ, ఇప్పుడు ఆ అనుభవం.. నేరుగా భారత్‌కే ఎదురైంది. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులుగా ముద్రపడిన భారతీయులను కూడా ట్రంప్ ఇలానే మన దేశానికి పంపించారు. కానీ, ఈ సమయంలో భారతీయులకు కూడా బేడీలు వేసి.. ఆర్మీ వాహనంలోనే పంపించడం వివాదానికి దారి తీసింది. మోడీ తనకు ఎంతో కావాల్సిన మిత్రుడు అని ట్రంప్‌కూడా పేర్కొన్న దరిమిలా.. ఇలా మిత్ర దేశానికి చెందిన పౌరులను కూడా ఘోరంగా అవమానిస్తారా? అన్న ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ మోడీ వ్యవహారంపై నిప్పులు చెరుగుతోంది. “మోడీ గారు సంగమంలో స్నానం చేస్తున్నారు. ఆయన కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. కానీ.. మోడీ ప్రియమిత్రుడు ట్రంప్ మాత్రం భారతీయులను చేతులు కట్టేసి.. భారత్‌కు తరిమేశారు. ఇదీ.. మోడీ పాలనలో భారతీయుల దుస్థితి” అని కాంటమెంట్లు చేయడం గమనార్హం. తాజాగా అమెరికా.. సుమారు 600 మందికిపైగా భారతీయులను అక్రమ వలసదరులుగా పేర్కొంటూ వెనక్కి పంపుతోంది.