ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా స‌ర్కారుకు మేలు చేస్తార‌ని అనుకున్నారు. త‌న దూకుడు. త‌న‌దైన బాణి వంటివాటిని వినియోగించి.. స‌ర్కారును అన్ని విధాలా కాపాడుతార‌ని కూడా లెక్క‌లు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా మ‌ల్ల‌న్న స్వ‌ప‌క్షంలో విప‌క్షం పాత్ర‌ను చ‌క్క‌గా పోషిస్తున్నారు. ఈ విష‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా స‌రిపోవ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

తాజాగా కుల‌గ‌ణ‌న విష‌యం.. ప్ర‌భుత్వానికి పాజిటివ్ టాక్ తీసుకువ‌స్తోంద‌న్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డం కామ‌నే. కానీ, సొంత పార్టీ ప్ర‌భుత్వంపై మ‌ల్ల‌న్న బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డం సుత‌రామూ.. ఎవ‌రూ మెచ్చ‌డం లేదు. బీసీల‌కు న్యాయం చేయడం ప్ర‌భుత్వానికి ఇష్టం లేద‌ని అన్నారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌భుత్వం బీసీల‌కు మంచి చేయ‌ద‌ని కూడా ఆయ‌న తేల్చేశారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో బీసీల లెక్క త‌ప్పింద‌ని కూడా వ్యాఖ్యానించారు.

దీంతో ఈవిష‌యాన్ని ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ మ‌రింత ఎక్కువ‌గా వినియోగించుకుంటోంది. మేం చెప్ప‌డం కాదు.. మీ నేత‌లే త‌ప్పుబ‌డుతున్నార‌ని గులాబీ ద‌ళం పేర్కొంటోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువే కావొచ్చు. కానీ, ఇలా..ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని రోడ్డున ప‌డేలా సొంత నేత‌లే వ్యాఖ్యానిస్తే.. మ‌రీ ముఖ్యంగా… మేధావిగా, విశ్లేష‌కుడిగా కూడా పేరున్న తీన్మార్ మ‌ల్ల‌న్నే ఇలా చేస్తే ఎలా అన్న‌ది పార్టీ నేత‌ల మాట‌.

ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగానే కాకుండా.. స‌ర్కారు ప‌రంగా కూడా.. రాజుకుంది. దీనిపై తాజాగా ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి స్పందించారు. పార్టీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌ను ఇలా రోడ్డున లాగడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌కు ఇస్టం లేక‌పోతే.. తీర్మాన్ త‌న దారి తాను చూసుకోవ‌చ్చ‌ని చెప్పుకొచ్చారు. పిలిచి పిల్ల‌నిచ్చిన‌ట్టు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే.. సొంత పార్టీకే ఎస‌రు పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు.