ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. ధమాకా తీసిన డైరెక్టర్ కావడంతో ప్రేక్షకుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి.
ఇది హిట్ అయితే మార్కెట్ పెరుగుతుందనే నమ్మకం సందీప్ కిషన్ లో బలంగా ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే ఈ కుర్రాడు పలు విషయాల్లో ఫస్ట్ ఛాయస్ గా మారుతుండటం గమనించాల్సిన అంశం. ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే నెట్ ఫ్లిక్స్ మొదటి తెలుగు వెబ్ సిరీస్ హీరో తనే కాబట్టి.
సూపర్ సుబ్బు టైటిల్ తో రూపొందిన కొత్త సిరీస్ టీజర్ తాజాగా విడుదల చేశారు. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమైన ఒక ఊరికి టీచర్ గా వెళ్లాల్సి వచ్చిన ఒక యువకుడు పడే కష్టాల సమూహారమే ఈ సుబ్బు కథ. బ్రహ్మనందం, మురళీశర్మ, హైపర్ ఆది లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది.
కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది. టిల్లు స్క్వేర్ సృష్టికర్త మల్లిక్ రామ్ ఈ సూపర్ సుబ్బుని రూపొందించడం విశేషం. చిన్న టీజరే అయినా ఆకట్టుకునేలా కట్ చేశారు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిన లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా కథానాయకుడు సందీప్ కిషనే.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జోసెఫ్ విజయ్ దర్శకుడిగా మారి చేస్తున్న తొలి ప్రయత్నానికి ఎంచుకున్నది కూడా సందీప్ కిషన్ నే. ఇలా ఒక మిడ్ రేంజ్ హీరో చాలా మందికి మొదటి ఆప్షన్ గా నిలవడం చిన్న విషయం కాదు. ఇవే కాదు ధనుష్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో తెరను పంచుకుంటూ, ఫ్యామిలీ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో భాగమవుతూ సందీప్ కిషన్ రకరకాలుగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు ఆపడం లేదు.
ఇక సూపర్ సుబ్బు విషయానికి వస్తే ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనే ఒక ఊరి బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. అందులోనూ నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ అంటే ఎలాంటి వినోదం ఉండబోతోందో వేచి చూడాలి.