నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో విశాఖ జోన్ అంటే ఇదిగో ప్రారంభోత్సవం అంటూ ఐదేళ్ల పాటు ప్రకటనలతో కాలయాపన చేయడం తప్ప అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసేలా ఒప్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. జగన్ ఢిల్లీ వెళ్లి తన కేసుల గురించి, అప్పుల గురించి మాట్లాడడమే తప్ప రైల్వే జోన్ కోసం ఏనాడూ మాట్లాడలేదని టీడీపీ నేతలు విమర్శించారు. కట్ చేస్తే….ఏపీతో పాటు కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తరాంధ్రతో పాటు నవ్యాంధ్ర ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నేడు ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఈ వ్యవహారంపై స్పందించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖ రైల్వే డెవలప్మెంట్ లో ఇది చరిత్రాత్మక ముందడుగు అని ఆయన అన్నారు. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తూ వాల్తేరును “విశాఖపట్నం డివిజన్” గా పునర్ నామకరణం చేసిందని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన మరో విజయమన్నారు.

విశాఖపట్నం డివిజన్ తో రైల్వే మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయని, కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు విశాఖ డివిజన్ హబ్‌గా మారనుందని, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రణాళికలు, మెరుగైన ప్రయాణం వంటి అంశాలకు ఇది కీలక పరిణామని తెలిపారు. ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి, సీఎం చంద్రబాబు కు శ్రీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.