టాలీవుడ్లో గొప్ప చరిత్ర ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. ఆ సంస్థను నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు అల్లు అరవింద్. ఐతే తన నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కొడుకుల్లో ఒకరి చేతుల్లో పెడతారని అందరూ అనుకుంటే.. ఆయన మాత్రం బన్నీ వాసు అనే బయటి వ్యక్తిని ఎంతగానో నమ్మారు. అతనే చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ వ్యవహారాలను చూస్తున్నాడు.
అరవింద్ పెద్దబ్బాయి బాబీకి కూడా ప్రొడక్షన్లో కొంత పాత్ర ఉన్నప్పటికీ.. అరవింద్ తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నది మాత్రం వాసునే. బన్నీతో ఉన్న స్నేహంతో గీతా ఆర్ట్స్‌లోకి వచ్చిన వాసు.. తన పనితనంతో అరవింద్‌ను మెప్పించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు అరవింద్ పేరే నిర్మాతగా పడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న సినిమాలకు బన్నీ వాసు పేరు ప్రొడ్యూసర్‌గా చూస్తున్నాం. పెద్ద బడ్జెట్ కాని సినిమాలను జీఏ2 బేనర్ మీద నిర్మిస్తూ వాటికి వాసు పేరునే నిర్మాతగా వేస్తున్నారు.
ఐతే త్వరలో బన్నీ వాసు వేరు కుంపటి పెడుతున్నట్లుగా ఇటీవల ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు బన్నీ వాసు. ‘‘ఈ విషయం కొంచెం తప్పుగా జనాల్లోకి వెళ్తోంది. నేను వేరే బేనర్ ఏమీ పెట్టట్లేదు. గీతా ఆర్ట్స్ నుంచి బయటికి రావట్లేదు. నాకు, అరవింద్ గారికి కొన్ని కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నాకు నచ్చింది ఆయనకు నచ్చకపోవచ్చు. ఆయనకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు.
మాలో ఎవరికి నచ్చకపోయినా ఆ ప్రాజెక్టును డ్రాప్ చేస్తుంటాం. ఐతే నేను అరవింద్ గారికి ఈ మధ్య ఒక మాట చెప్పా. నాకు ఏదైనా కథ నచ్చి, మీకు నచ్చకపోయినా వాటిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను అని. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఆ సినిమాలను కూడా జీఏ2 బేనర్ మీదే చేస్తాను. వేరే బ్యానర్లో చేయడం, నేను వేరు కుంపటి పెట్టడం లాంటివేమీ ఉండదు. నా అభిరుచికి తగ్గ సినిమాలను ప్రొడ్యూస్ చేయడం దీని ఉద్దేశం’’ అని బన్నీ వాసు తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates