ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఐదేళ్ల పాటు తమను తీవ్ర వేధింపులకు గురి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల పని పట్టడం లేదన్నది వారి ఆవేదన. ఆ ఐదేళ్లు అదుపు తప్పి ప్రవర్తించిన వారి మీద సరైన చర్యలు చేపట్టడం లేదని.. కేసులు పెట్టట్లేదని.. ఇప్పటికీ వాళ్లంతా దర్జాగా తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అలాగే అప్పటి ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించిన వారికి ప్రస్తుత ప్రభుత్వంలోనూ అండదండలు లభిస్తుండం పట్ల కూడా ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లి వ్యవహారం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంగ్లి గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పదవిని అనుభవించిన సంగతి తెలిసిందే.
మంగ్లి తాజాగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథ సప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటోకాల్ దర్శనం చేసుకోవడం.. మంత్రితో సన్నిహితంగా మెలగడం.. ఆయనతో కలిసి విలేకరులతో మాట్లాడ్డం తెలుగుదేశం కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టీడీపీ అంటే అస్సలు గిట్టని, జగన్‌ను ఎంతో అభిమానించే మంగ్లికి కూటమి ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యం, మర్యాదలు అవసరమా అంటూ టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో మండి పడుతున్నారు.
మంగ్లి ఒక టీవీ ఛానెల్లో పని చేసేటపుడు.. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు.. వైసీపీ మద్దతుగా ఆమె ప్రచారం చేసిన వీడియోలను వాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వైసీపీ కోసం పాటలు కూడా పాడిన ఆమె.. టీడీపీ కోసం అడిగితే పాటలు పాడనంటే పాడనని తెగేసి చెప్పిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ పట్ల ఇంత వ్యతిరేకత ఉన్న వ్యక్తిని ఇలా గౌరవించి కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రత్యర్థుల విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వానికి.. ఈ పరిణామం కొంత ఇబ్బందికరంగానే మారినట్లు కనిపిస్తోంది.