అంత త‌ప్పు చేసి.. మ‌ళ్లీ ఇదేం స‌మ‌ర్థ‌న‌?

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన‌ గాయ‌కుల్లో ఒక‌డిగా ఉదిత్ నారాయ‌ణ పేరు చెప్పొచ్చు. ఆయ‌న ద‌క్షిణాది సంగీత ప్రియుల‌కు కూడా బాగానే ప‌రిచ‌యం. 90ల చివ‌ర్లో చూడాల‌ని ఉందిలో పాడిన రామ్మా చిల‌క‌మ్మా పాట‌తో తెలుగు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఒక ఊపు ఊపేశారు. త‌ర్వాత ఓ ద‌శాబ్దం పాటు బోలెడ‌న్ని పాట‌లు పాడాడు.ఆయ‌న పాడిన ప్ర‌తి పాటా సూప‌ర్ హిట్టే.

హిందీలో కూడా ఒక రెండు ద‌శాబ్దాల పాట టాప్ సింగ‌ర్‌గా కొన‌సాగిన ఉదిత్.. ఈ మ‌ధ్య లైమ్ లైట్‌కు దూర‌మ‌య్యాడు. ఐతే ఇటీవ‌ల యుఎస్ వేదిక‌గా ఆయ‌న ఒక మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో అభిమానంతో త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన మ‌హిళా అభిమానుల‌కు ఆయ‌న ఘాటు ముద్దులు ఇవ్వ‌డం తీవ్ర వివాదాస్ప‌దం అయింది. ఒక మ‌హిళ త‌నే ఉదిత్‌కు బుగ్గ‌పై ముద్దు పెట్ట‌గా.. ఆయ‌న ఆమెకు పెద‌వి ముద్దు ఇచ్చేశారు.

ఆ త‌ర్వాత సెల్ఫీ కోసం వ‌చ్చిన అమ్మాయిలంద‌రికీ ముద్దులు ఇచ్చేశారు. పిలిచి మ‌రీ లేడీ ఫ్యాన్స్‌కు ముద్దులు ఇవ్వ‌డంతో దుమారం రేగింది. కొంచెం లేటుగా సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చిన ఈ వీడియో వైల‌ర్ అవుతోంది. ఉదిత్ మీద తీవ్ర విమర్శ‌లు త‌ప్ప‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో ఉదిత్ స్పందించాడు. చేసిన త‌ప్పిదానికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పేస్తే పోయేది. కానీ ఆయ‌న మాత్రం త‌న చ‌ర్య‌లను స‌మ‌ర్థించుకుంటున్నాడు.

యుఎస్‌లో కొన్ని రోజుల ముందు జ‌రిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోల‌ను ఇప్పుడెందుకు వైర‌ల్ చేసి వివాదం చేస్తున్నార‌ని.. ఇదంతా త‌న‌పై కుట్ర‌పూరితంగా దుష్ప్ర‌చారం చేయడంలో భాగ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వీడియోను చెడు దృష్టితో చూస్తున్నార‌ని.. త‌న‌కు, త‌న అభిమానుల‌కు మ‌ధ్య లోతైన‌, తెగిపోని, స్వ‌చ్ఛ‌మైన బంధం ఉంద‌ని.. త‌మ మ‌ధ్య ఉన్న ప్రేమ‌నే ఆ వీడియోలో చూశార‌ని ఆయ‌న అన్నాడు.

ఎవ‌రైనా ఇందులో చెడును చూస్తుంటే వాళ్ల‌కు సారీ అని.. కానీ త‌న‌కు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవ‌ని ఉదిత్ అన్నాడు. త‌ను పేరు చెడ‌గొట్ట‌డానికి కొంద‌రు చూస్తున్నార‌ని.. కానీ త‌న‌ను ఎంత కిందికి లాగితే అంత పైకి లేస్తాన‌ని ఉదిత్ స్ప‌ష్టం చేశాడు.