ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో ఇందూరు గిరిజన కళాశాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచిన ఆ తర్వాత కేసీఆర్ తనని కలిశారని మోడీ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ తనతో అన్నారని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనని కోరారని చెప్పారు.
అయితే, ప్రజలు ఆశీర్వదిస్తేనే నాయకులు గెలుస్తారని తాను చెప్పానని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ రహస్యాన్ని ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదని, జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాతే తెలంగాణలో గట్టిగా పోటీ చేసి నిలబడాలని తాను అనుకున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, ఆసుపత్రులు, రైల్వే లైన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల్లో శక్తిసామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ కే దక్కుతుందని చెప్పారు.
వేలాదిమంది బలిదానాలతో బంగారు తెలంగాణ కల సాకారమైందని, కానీ, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని, ఈ కుటుంబ పాలనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates