రాయలసీమలోనే తేల్చుకోనున్న భువనేశ్వరి?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారా? ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ర్యాలీలో పాల్గొంటూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్న ఆమె.. ఇక బస్సు యాత్రతో ప్రజల్లోకి మరింత వెళ్లబోతున్నారా? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. త్వరలోనే నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ నెల 3 (మంగళవారం)ను సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ కేసులో తీర్పును అనుసరించి బస్సు యాత్రపై భువనేశ్వరి ఓ నిర్ణయం తీసుకోనే అవకాశముంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ మీద జైలుకు వెళ్లడంతో నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలోనే ఉంటూ పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణులతో కలిసి సాగుతున్నారు. వైసీపీపై విమర్శల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. తన మాటలతో పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడికి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేసే విషయంపై భువనేశ్వరి ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా రాయలసీమ నుంచి యాత్ర మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి ఈ యాత్ర మొదలెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ యాత్రను నిర్వహించాలా? వద్దా? అన్నది చంద్రబాబు పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. ఒకవేళ సుప్రీం కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసినా లేదా బాబుకు అనుకూలంగా తీర్పు వచ్చినా లేదా బెయిల్ దక్కినా.. ఈ పరిణామాలు భువనేశ్వరి యాత్రపై ప్రభావం చూపే ఆస్కారముంది.