రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే యువత పెద్ద ఎత్తున నష్టపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం జగన్ కు ఐదేళ్ల కాలం ఒక వ్యక్తి జీవితంలో ఎంత విలువైందో తెలియదని పేర్కొన్న జనసేన అధినేత ఐదేళ్ల కాలంలో చాలా మంది యువత వయస్సు పెరిగి ఉద్యోగాలకు అర్హత కోల్పోతారు కాబట్టి వారే ఆలోచించుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పోలీసులను అండగా పెట్టుకుని.. కిరాయి సైన్యాన్ని చేతిలో పెట్టుకున్న వైసీపీతో పోరాడుతున్నామంటే ప్రజలు అందిస్తున్న భరోసాయే కారణమని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తనకు సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తానని, సీఎం పదవి కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి ఖాయమని పవన్ జోస్యం చెప్పారు. వై నాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారని, కానీ వైసీపీకి 15 సీట్లు కూడా రావని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా జనసేనాని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా ఉంటామన్నారు.
అనుక్షణం బెదిరింపులు.. యుద్ద రంగం నుంచి వదిలివేయాలనే కామెంట్లు వస్తున్నప్పటికీ ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని…100 మందికి పైగా ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్లే కౌరవులు అని పవన్ అన్నారు. జగన్ ఓటమి ఖాయమని, టీడీపీ-జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్ తెలిపారు. ప్రజల కోసం తాను మాటిచ్చానని పేర్కొంటూ ఆ మాట ప్రకారం నిలబడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అధికారం కోసం అర్రులు చాచడం లేదన్న పవన్…ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకొని టీడీపీతో కలిసి వెళ్తున్నట్లు ప్రకటించారు. జగన్ పాలన బాగుండి ఉండుంటే.. నా వారాహి వాహనం రోడ్డేక్కేదే కాదన్నారు. జగన్ చక్కటి పరిపాలన ఉండుంటే నాలుగో విడత వారాహి యాత్రకు ఇంత స్పందన రాదన్నారు. యువతను మోసం చేసిన ప్రభుత్వాన్ని తాను అధికారంలోకి ఉండనివ్వనన్నారు. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే అని పవన్ స్పష్టం చేశారు. గతంలో ఓట్లు చీలకుండా ఉండి ఉంటే ఏపీలో పరిస్థితి ఇలా ఉండేది కాదని గుర్తించాను కాబట్టే తెలుగుదేశం పార్టీతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates