జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు క్రిష్ణా జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఏం మాట్లాడుతాడు అన్నదానిపై ఆసక్తి నెలకొని ఉంది.
ఊహించినట్లే కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగం సంచలనంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈరోజు పవన్ మాట్లాడుతూ సెప్టెంబరులో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పేరుతో ప్రభుత్వం సర్వే చేయించగా అందులో ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయాలు వచ్చాయి. వేరే రాష్ట్రాలకు 3.17 లక్షలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయని ఈ సర్వేలో తేలింది. 3 లక్షలకు పైగా పిల్లలు డ్రాపవుట్స్ అయ్యారు. 62,754 మందికి పైగా బడి ఈడు పిల్లలు చనిపోయారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఇటు ప్రస్తుత తరమే కాకుండా భవిష్యత్ తరం ఎలా ఇబ్బందుల పాలు అవుతుందో పవన్ గణాంకాలతో వివరించారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు అంటూ పవన్ పేర్కొన్నారు.
లక్షలాది కోట్లు ఉన్నవాడితో, ప్రైవేట్ సైన్యం ఉన్న వాడితో, అనుభవజ్ఞులైన వారిని కూడా కటకటాల్లోకి పంపించిన వ్యక్తితో మీకోసం నేను తలపడుతున్నాను అంటే నా నైతిక బలం ఎంత అనేది అర్దం చేసుకోండి అంటూ తన నిబద్దతను, తన పోరాటాన్ని పవన్ వ్యక్తీకరించాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను అంటూ తనకు రాజకీయ పరిణతి లేదనే వారికి క్లారిటీ ఇచ్చారు. 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ స్పీచ్‌లో పరిణతి కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates