ధర్మాన తప్పుకున్నట్లేనా ?

మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో నుండి తప్పుకుంటున్నారా ? ఆయన స్వయంగా చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటంలేదని స్పష్టంగా ప్రకటించారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ధర్మాన ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. అయితే తన నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదని కూడా చెప్పారు.

రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తననే పోటీ చేయమని జగన్ చెప్పారట. అయితే తాను కూడా తన నిర్ణయాన్ని కచ్చితంగానే  చెప్పేసినట్లు చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికల నుండి తప్పుకుంటున్నాను కానీ రాజకీయాల నుండి కాదన్నారు. పార్టీకి 24 గంటలూ అందుబాటులోనే ఉంటూ ఎక్కడ తన సేవలు అవసరమైతే అక్కడ పనిచేస్తానన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే మంత్రి కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చాలాకాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఇప్పటికే శ్రీకాకుళం మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్నాడు. రాబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. తండ్రి తరపున ఇప్పటికే పార్టీలో, నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ తో పూర్తిస్ధాయిలో మమేకం అయిపోతున్నారు. కాబట్టి ఏ కోణంలో చూసినా రాబోయే ఎన్నికల్లో కొడుకు పోటీచేయటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధర్మాన ఎన్నికల రాజకీయాల నుండి తప్పుకున్నా వచ్చే ఇబ్బంది ఏమీలేదు.

వయసురీత్యా ధర్మానకు సుమారు 70 ఏళ్ళు దాటాయి. ఇదే సమయంలో సోదరుడు ధర్మాన కృష్ణదాసు కూడా నరసన్నపేటలో ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడా ఉన్నారు. కాబట్టి కృష్ణదాసు వారసులు కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. అన్నదమ్ములిద్దరు తప్పుకన్నా వైసీపీకి జరిగే నష్టం పెద్దగా ఉండదు. ఎందుకంటే తండ్రులు ఎన్నికల రాజకీయాల నుండి తప్పుకున్నా వచ్చేఎన్నికల్లో కొడుకుల గెలుపుకు కృషిచేస్తారనంటో సందేహంలేదు. కాకపోతే మిగిలిన నియోజకవర్గాలను ఏమిచేస్తారు అన్నదే కీలకం కాబోతోంది.