టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీతో జనసేన పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి రావడం, చంద్రబాబుకు బాసటగా టీడీపీతో కలిసి పోటీచేస్తానని పవన్ ప్రకటించడంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని లోకేష్ కూడా ప్రకటించారు. మరోవైపు, అక్టోబరు 1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి యాత్రను పవన్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని బాలయ్య తేల్చి చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయానిదే అంతిమ విజయం అని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని ఆరోపించారు. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రాక విశాఖలో పెయిడ్ ఆర్టిస్టులతో షో చేశారని ఆరోపించారు.
నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తాజాగా వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ప్రకటించడంతో రేపు అవనిగడ్డలో జరగబోయే సభలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనే చాన్స్ ఉందని తెలుస్తోంది.