అక్టోబ‌రు 4న రండి: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

ఏపీ సీఐడీ పోలీసులు.. టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. శ‌నివారం ఉద‌యం ఢిల్లీకి చేరుకున్న సీఐడీ పోలీసులు నారా లోకేష్ కోసం వెతికిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఎక్క‌డున్నార‌నే విష‌యంపై ఆరా తీశారు. అయితే, నారా లోకేష్ ఎక్క‌డ ఉన్నార‌నేది టీడీపీ బ‌య‌ట‌పెట్ట‌లేదు.

ఈ క్ర‌మంలో అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్న‌ట్టుగా తెలుసుకున్న సీఐడీ పోలీసులు.. ఆ కార్యాల‌యంలోకి వెళ్లి లోకేష్ కి 41 ఏ నోటిసులు అందించారు. దీనికి ముందు వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించారు. ఈ విష‌యాన్ని వెంట‌నే రాష్ట్ర హైకోర్టుకు కూడా సీఐడీ అధికారులు స‌మాచారం అందించారు.

నారా లోకేష్ ఉనికి త‌మ‌కు తెలియ‌నందున ఆయ‌న ఫోన్ వాట్సాప్‌కు నోటీసుల‌ను పంపించామ‌ని పేర్కొన్నారు. అయితే, త‌ర్వాత గ‌ల్లా కార్యాల‌యంలో నారా లోకేష్ ఉన్న విష‌యాన్ని తెలుసుకుని అక్క‌డ‌కు చేరుకుని నోటీసులు అందించారు. ఇక‌, నారా లోకేష్ కూడా త‌న‌కు అందిన నోటీసుల‌పై స్పందించారు. నోటిసులు అందుకున్నానని పేర్కొన్నారు. సిఐడి అధికారుల నుంచి స్వ‌యంగా నోటీసులు అందుకున్నారు.

అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న‌ట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ రోజు త‌ప్ప‌కుండా విచార‌ణ‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ఆయ‌న రిప్ల‌యి స‌మాధానంలో తెలిపారు.