చంద్రబాబు అవినీతి చేయరు – రవిబాబు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా గళం వినిపిస్తున్నారు. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కేఎస్ రామారావు.. ఇలా పలువురు సీనియర్లు ఇప్పటికే బాబు అరెస్టును ఖండించారు. ఐతే వీళ్లు ముందు నుంచే టీడీపీ సపోర్టర్లన్న సంగతి తెలిసిందే. ఐతే తెలుగుదేశం పార్టీ అంటే తనకు ఇష్టం లేదు అని ప్రకటించుకున్న ఓ సినిమా వ్యక్తి ఇప్పుడు బాబు అరెస్టును తప్పుబట్టారు. అంతే కాక బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. నటుడు, దర్శకుడు రవిబాబు.

చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా వంద సార్లు ఆలోచించి చేస్తారని.. ఆయన చిన్న తప్పు కూడా చేయరని.. అవినీతికి పాల్పడరని రవిబాబు అభిప్రాయపడ్డారు. 50 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన జీవితంలో ఇదే తన చివరి రోజు అని తెలిసినా కూడా ప్రజల గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తారని.. అలాంటి వ్యక్తిని 73 ఏళ్ల వయసులో, అది కూడా ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టి వేధించడం అన్యాయమని రవిబాబు అన్నాడు. చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని ఆయన్ని బయటికి విడిచిపెట్టాలని.. ఆయనేమీ దేశం విడిచి పారిపోయే వ్యక్తి కాదని.. బయట ఆయన్ని ఎన్ని రోజులైనా విచారించవచ్చని రవిబాబు అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పాలకులు దృష్టిలో ఉంచుకోవాలని.. వాళ్లు అనుకుంటే చిటికెలో బాబును బయటికి పంపించగలరని.. ఏ అధికారంతో చంద్రబాబును జైలుకు పంపించారో అదే అధికారంతో ఆయన్ని బయటికి తీసుకురావాలని.. ఆ పని చేస్తే తన లాంటి వాళ్లు కృతజ్ఞులుగా ఉంటామని రవిబాబు అన్నాడు.

ఈ వీడియో బయటికి రాగానే తెలుగుదేశం పార్టీకి రవిబాబు భజన చేస్తున్నాడంటూ కొందరు విమర్శలు గుప్పించారు సోషల్ మీడియాలో. కానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు తెలుగుదేశం పార్టీ అంటే నచ్చదని రవిబాబు ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి యాడ్స్ చేసినప్పటికీ అది ఒక ప్రొఫెషనల్‌గానే చేశానని.. టీడీపీ ఆఫీస్‌లో అందరి ముందూ తనకు ఆ పార్టీ నచ్చదని చెప్పానని ఆ ఇంటర్వ్యూలో రవిబాబు పేర్కొన్నాడు.