స్కిల్ స్కాం కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుతోపాటు ఏపీ ఫైబర్ స్కామ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు కూడా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు లోకేష్ కు ఊరటనిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఫైబర్ గ్రిడ్ కేసులో మాత్రం లోకేష్ కు ఊరట లభించలేదు. ఆ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను అక్టోబర్ 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో లోకేష్ కు సి ఆర్ పి సి సెక్షన్ 41 ఏ ప్రకారం సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే‌. దీంతో, ఆ కేసులో కూడా లోకేష్ ను ప్రస్తుతానికి అరెస్టు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. 

మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు  వినిపిస్తుండగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తున్నారు. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒక బూటకమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ కేసులో నారాయణ పేరు కూడా సిఐడి అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే. 2001 లోనే ఈడుపుగల్లులో తనకు 40 సెంట్లు భూమి ఉందని ఆ భూమి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కోల్పోయానని నారాయణ అన్నారు. అంత నష్టపోయిన తనపైనే రివర్స్ లో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.