విశాఖ‌ప‌ట్నం-న‌ర‌సాపురం-క‌డ‌ప‌..వెరీ ఇంట్ర‌స్టింగ్‌ స్టోరీ

అదేంటి? ఏపీలో ఎన్నో న‌గ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఈ మూడు ప్రాంతాల‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంత స్పెషాలిటీ? ఏంటా ఇంట్ర‌స్టింగ్ అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జ‌మే. మ‌రో ఆరేడు మాసాల్లో జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నికల నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కంగా మారాయి. ఈ మూడు చోట్ల విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నింది.

ప్ర‌స్తుతం ఈ వ్యూహాలు నెమ్మ‌దించినా.. ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న అంటూ వ‌స్తే.. ఖ‌చ్చితంగా విశాఖ‌, న‌ర‌సాపురం, క‌డ‌ప పార్ల‌మెంటు స్థానాల‌ను టీడీపీ ద‌క్కించుకోవాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. వైసీపీ ఈ మూడు చోట్ల చేసిన ఘ‌న కార్యాల‌ను(టీడీపీ నేత‌ల మాట‌ల్లో) ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. ఈ మూడు స్థానాల‌ను తాము ద‌క్కించుకోవాల‌నేది టీడీపీ ప్లాన్‌.

విశాఖ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. అయితే.. ఈయ‌న వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి లేక‌పోగా.. ప్ర‌జ‌ల‌కు కూడా ర‌క్ష‌ణ లేద‌నేది టీడీపీ వాద‌న‌. ఎంపీ కుటుంబ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేస్తేనే దిక్కులేని ప‌రిస్తితి ఏర్ప‌డింద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో విశాఖ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ కావాలంటే.. ఇక్క‌డ టీడీపీని గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ఆ పార్టీ నేత‌ల మాట.

న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇక్క‌డ విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న స్వ‌ల్ప‌కాలంలోనే పార్టీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌. ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డం.. త‌న‌ను పోలీసులు చిత‌క్కొట్టారంటూ.. ఆయ‌నే స్వ‌యంగా మీడియా ముందు చెప్ప‌డం, కేసులు పెట్ట‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సొంత పార్టీ నాయ‌కుడిని వేధించిన వైసీపీకి యాంటీగా ఇక్క‌డ టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీని ఓడించాల‌నేది టీడీపీ ల‌క్ష్యం.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన మూడో నియోజ‌క‌వ‌ర్గం క‌డ‌ప‌. ఇది కూడా వైసీపీ నాయ‌కుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలోనే ఉంది. అయితే.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నం దున.. ఈ ప‌రిణామాల‌ను టీడీపీ నాయ‌కుడు బీటెక్ ర‌వి త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ జెండా ఎగ‌రేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తంగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ మూడు మాత్రం త‌మ ఖాతాలో ప‌డ‌డం ఖాయ‌మ‌నేది టీడీపీ వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.