తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి బలం చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందనే చెప్పాలి. త్వరలోనే మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ 119 స్థానాల్లో దాదాపు 80 సీట్లు కచ్చితంగా గెలవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 119 స్థానాలకు గాను 1006 దరఖాస్తులు వచ్చాయి. వీటిని వడబోసే కార్యక్రమం తుది దశకు చేరుకుంది. అయితే మొదటగా ఒక్క స్థానానికి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుందనే వార్తలు వచ్చాయి. మొత్తం మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటిస్తుందనే అంచనాలు కలిగాయి. కానీ ఇప్పుడు ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్ భావిస్తోందని టాక్. ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల సమరానికి సై అనాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలిసింది.
మరోవైపు సీట్ల కేటాయింపులపై తుది దశ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 80 స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కానీ ఇంకో 30 నుంచి 40 స్థానాల విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నట్లు తెలిసింది. ఓ వైపు పార్టీలో ఉన్న నేతలు.. మరోవైపు ఇతర పార్టీల్లో నుంచి వస్తున్న కీలక నేతలు.. ఇలా కొన్ని చోట్ల టికెట్ల కేటాయింపుపై సందిగ్ధత ఏర్పడింది. అయితే బయట పార్టీల నుంచి వచ్చిన కీలక నేతల కోసం.. సొంత పార్టీలోని నాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ గెలవడమే లక్ష్యమని, అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్ దక్కిన నేతలకు తగిన గౌరవమిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి నాయకులను బుజ్జగిస్తూ ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందనే చెప్పాలి.