ఏపీలో ఎన్నికలకు మరో ఆర్నెల్లు మాత్రమే సమయం ఉన్న వేళలో.. రాజకీయం వేడెక్కిన వేళ.. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. దాని పేరు.. ఆ ప్రోగ్రాం ఎలా సాగుతుందన్న విషయాల్ని వెల్లడించారు. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు.. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇన్ ఛార్జులు.. ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడించారు.
ఇదే సమావేశంలో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఆసక్తికర ప్రజంటేషన్ ఇచ్చారు. ఇందులో త్వరలో చేపట్టే కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అన్న పేరుతో సరికొత్త కార్యక్రమానికి తెర తీయనున్నట్లుగా పేర్కొన్నారు. దీన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. ప్రభుత్వ పరంగా చేపట్టే జగనన్న ఆరోగ్య సురక్ష గురించి చెప్పారు. ఈ కార్యక్రమం గురించి మధ్యలో సీఎం జగన్ కూడా పలు వివరాల్ని వెల్లడించారు.
రాబోయే ఆర్నెల్లు మరింతగా కష్టపడాలన్న ఆయన.. ‘వచ్చే రెండు నెలలు ఈ కార్యక్రమాల్ని ఎగ్రెసివ్ గా చేపట్టాలి. వీటిలో వాలంటీర్లు.. జగనన్న గ్రహ సారథులు అందరినీ భాగస్వాములుగా చేయనున్నాం. గడప గడపకు మన ప్రభుత్వంతో పాటే వీటినీ కొనసాగించాలి. నవంబరులో గడప గడప ప్రోగ్రాంను ముగిద్దాం. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి జనం ఆరోగ్యంపై జల్లెడ పడతారు. ఉచితంగా పరీక్షలు.. మందులతోపాటు దీర్ఘకాలిక సమస్యలున్న వారికి అవసరమైన వైద్య సేవలు అందించటం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది’’ అని సీఎం జగన్ వెల్లడించారు.
మొత్తంగా రాబోయే రోజుల్లో తన వ్యూహం ఎలా ఉంటుందన్న విషయంతో పాటు.. ఎన్నికలకు సంసిద్ధతకు సంబంధించిన వివరాల్ని పార్టీ నేతలతో పంచుకున్న జగన్ వైఖరి చూస్తే.. తాను వెళ్లే దారి.. వెళ్లాల్సిన తీరుపై పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వంతో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందన్న సమాచారాన్ని సేకరిస్తున్న జగన్ సర్కారు.. తాజా కార్యక్రమంతో ప్రజల్లో సరికొత్త ఆలోచనల్ని తీసుకొచ్చేలా చేస్తారంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే బదులివ్వాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates