కేటీఆర్ తీరుతో హ‌ర్ట్‌… ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి

త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్ అంటూ వార్త‌లు చ‌క‌క‌ర్లు కొడుతున్న స‌మ‌యంలో…. తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలోని అసంతృప్తులు గ‌తంలోని క్ర‌మ‌శిక్ష‌ణ‌ను లైట్ తీసుకుంటూ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఒకే ఉమ్మ‌డి జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గులాబీ జెండాను వీడనున్నారు. ఈ ఇద్ద‌రూ టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కేటీఆర్ స‌న్నిహిత మిత్రుడైన జాన్స‌న్ నాయ‌క్ కు ఖానాపూర్ టికెట్ కేటాయించ‌డం, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన త‌న‌ను త‌ప్పించ‌డంతో ఆమె హ‌ర్ట‌య్యారు. ఆడ‌బిడ్డ‌ను అయిన త‌న‌ను కేటీఆర్ అవ‌మానించారంటూ ఆమె ఫైర‌య్యారు. రేఖానాయ‌క్ భ‌ర్త ఇప్ప‌టికే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోగా త్వ‌ర‌లో ఆమె సైతం కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా వెల్లడించారు.

గత నెలలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే బాపురావు పేరు లేదు. ఈ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న బాపురావుపై అనుచరులు కూడా పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే బాపురావు మాత్రం పార్టీని వీడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే, మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా ఆయన ఇవ్వకపోవడంతో పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. గౌరవం లేని పార్టీలో ఉండటం అనవసరమని భావించిన ఆయన బైబై చెప్పేశారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అందులోనూ ఒకే సామాజిక వ‌ర్గం వారు మంత్రి కేటీఆర్ ను కార‌ణంగా పేర్కొంటూ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం సంచ‌లనంగా మారింది. మ‌రోవైపు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ చేరిక‌తో హ‌స్తం పార్టీ బ‌లోపేతం అవుతుండ‌గా బీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.