యువగళం మళ్లీ స్టార్ట్

టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడి అరెస్టుతో నిలిపివేసిన యువగళం పాదయాత్రను లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తూనే.. మరోవైపు యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బాబు అరెస్టును మరింతగా తీసుకెళ్లేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని తెలిసింది. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించే ఆలోచనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలోని 100 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయడం సహా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 23న లోకేష్ యువగళం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ లోకేష్ సాగారు. ఈ యాత్ర 200 రోజులు, 2700 కిలోమీటర్లు దాటింది. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామమిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.

అనంతరం ఢిల్లీ వెళ్లిన లోకేష్ జాతీయ స్థాయిలో బాబు అరెస్టును చర్చనీయాంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సుప్రీం కోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తున్నారు. ఇప్పుడేమో అటు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే.. ఇటు యువగళం పాదయాత్ర తిరిగి చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. పాదయాత్ర నిలిచిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించనున్నారు.